హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యుల హక్కులు, గౌరవం కాపాడాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తాతా మధు, వాణీదేవి పేర్కొన్నారు. గురువారం శాసనమండలి ఐదోరోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. స్పెషల్ మోషన్‌పై కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డికి చైర్మన్ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. సమావేశాలకు వస్తున్న తమ వాహనాన్ని తనిఖీ చేసిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సభ్యులు లేకుండానే బిల్లుకు ఆమోదం తెలపడంపై ఎమ్మెల్సీలు తాతా మధు, సత్యవతి రాథోడ్, వాణీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి సభలో ఇలాంటి పరిస్థితి సభ్యులకు ఎదురుకాకుండా చైర్మన్ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సభ్యుల నుంచి చైర్మన్ పిటిషన్లను స్వీకరించి సభను వాయిదా వేశారు.
గిరిజనులకు 10 %రిజర్వేషన్లు అమలు చేయాలి
విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. 2023లో జీవో 33 ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచింది. జీవో 33కి రాజ్యాంగ రక్షణ కల్పించి, రిజర్వేషన్లు కల్పించాలి.
– ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
పాఠశాలల్లో వసతులు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలి.
– ఎమ్మెల్సీ వాణీదేవి