తెలంగాణ జీవధార కాళేశ్వరం నిలిచి గెలిచింది.. ‘కూలేశ్వరం’ అంటూ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసిన అనంతరం అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పూర్తి నాణ్యతగా ఉన్నాయని, మేడిగడ్డ బ్లాక్7లో స్వల్ప లోపాలు ఉన్నాయని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంటర్ ఫర్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్) నిర్ధారించినట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, కుంగింది.. అంటూ రేవంత్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతో ప్రాజెక్టును పడావు పెట్టిన వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు సాగు, తాగు నీటిని సరఫరా చేయకుండా రెండున్నరేండ్లుగా ప్రభుత్వం పన్నిన కపటనీతి బట్టబయలైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అంటించాలనే హస్తంపార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్ట నాటకాన్ని తుత్తునియలు చేస్తూ.. కాళేశ్వరం బరాజ్‌ల నాణ్యాతలో లోపాల్లేవని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంటర్ ఫర్ వాటల్, పవర్ రీసెర్చ్ స్టేషన్) నిర్ధారించినట్టు తెలుస్తున్నది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పూర్తిగా నాణ్యతతో ఉండగా, మేడిగడ్డ బరాజ్‌లోని బ్లాక్-7లో స్వల్ప లోపాలను గుర్తించినట్టు నివేదికలో వెల్లడించింది. దీంతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా అబద్ధమని తేలింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు చేపట్టాల్సి ఉన్నది. అందులో భాగంగా తొలుత పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవలే జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సానింగ్ , డ్రోన్ సర్వేలు, బోర్‌హోల్స్ , జియోటెక్నికల్, జియోఫిజికల్, జియో పెనెట్రేటింగ్ రాడార్ తదితర సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. తద్వారా మూడు బరాజ్‌లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం, గేట్ల నాణ్యత, థిక్నెస్, కాంక్రీట్ సాంద్రత గుణాత్మక మార్పులు, కోర్ నమూనాలను నిపుణులు అధ్యయనం చేశారు.
తాజాగా అందుకు సంబంధించిన ఫలితాలను ప్రాజెక్టు అధికారులకు సీడబ్ల్యూపీఆర్ఎస్ సమర్పించింది. నాణ్యతలో లోపాల్లేవని నివేదించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని అన్ని పియర్స్‌లో కాంక్రీటు నాణ్యత చాలా బాగున్నదని కేంద్ర సంస్థ స్పష్టం చేసినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాటిలో చిన్నలోపం కూడా కనిపించలేదని, 100 శాతం నాణ్యతగా ఉన్నాయని నిర్ధారించినట్టు వివరించారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి కూడా ఇంచుమించు అవే ఫలితాలను వెల్లడించినట్టు అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా, మిగతా బ్లాక్‌ల్లో ఎక్కడా, ఎలాంటి నాణ్యతా లోపాల్లేవని కేంద్రసంస్థ తేల్చి చెప్పిందని అధికారవర్గాలే తెలిపాయి.
కుంగుబాటునకు గురైన 7వ బ్లాక్‌లోని 5పియర్స్‌లో కూడా నాణ్యతా లోపాలను గుర్తించలేదని, మిగిలిన 6 పియర్స్లోనే నిర్దేశిత ప్రమాణాల కంటే స్వల్పంగానే నాణ్యతా లోపాలను గుర్తించినట్టు కేంద్ర సంస్థ నివేదించింది. మొత్తంగా 3 బరాజ్‌ల్లో నాణ్యతాపరమైన లోపాలేమీ లేవని సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక వివరించిందని అధికార వర్గాలు సైతం వివరిస్తున్నాయి. దీంతో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూలిపోతాయనేది అవాస్తమని తేలింది.
మేడిగడ్డ బరాజ్‌లో మొత్తం 8 బ్లాక్‌లు ఉన్నాయి. అన్ని బ్లాక్‌ల్లో కలిపి మొత్తంగా 85 గేట్లు ఉన్నాయి. అందులో 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గల కారణాలను అన్వేషించేందుకు ఇంజినీరింగ్ అధికారులు గతంలోనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను నిర్మాణ ఏజెన్సీ సంస్థ ఎల్అండ్టీ, ఐఐటీ రూర్కీ సంస్థ కూడా అధ్యయనం చేసింది. తొలుత కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ వద్ద ఈఆర్టీ (ఎలక్ట్రోడ్ రెసిస్టివిటి టెస్ట్)ను నిర్వహించింది. అంటే ప్రధానంగా విద్యుత్తు నిరోధకత ఆధారంగా భూగర్భ పరీక్షలు చేసింది. బరాజ్ ఫౌండేషన్‌ను అధికారులు నిశితంగా పరీక్షించారు.
ఆ తర్వాత భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్ (జీపీఆర్) నిర్వహించారు. భూగర్భంలో ఉన్న వివిధ మట్టి పొరలు, పదార్థాల లక్షణాలు, సంభవించిన మార్పులు, పగుళ్లు, శూన్యాలను తెలుసుకునేందుకు దీనిని నిర్వహిస్తారు. అనంతరం మేడిగడ్డ బరాజ్‌లోని అన్ని బ్లాకుల్లోనూ నిర్మాణ ఏజెన్సీ ఈఆర్టీ, జీపీఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో 7వ బ్లాక్ మినహా అన్ని బ్లాకులు భద్రంగానే ఉన్నాయని ఆ పరీక్షల్లో తేలింది. 7వ బ్లాక్‌లోనూ రాఫ్ట్ కింద 20వ పిల్లర్ కింద మినహా మరేచోట ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని నివేదించాయి. ఆయా భౌగోళిక అధ్యయనాల్లో తేలిన అంశం ఏమిటంటే బరాజ్ దెబ్బతిన్న బ్లాక్ 7 పునాది కింద దాదాపు 1,000 క్యూబిక్ మీటర్ల శూన్యం (బొయ్యారం) ఉన్నదని గుర్తించారు.
7వ బ్లాక్ 20వ పిల్లర్ వద్ద ఏర్పాటు చేసిన పలు సీకెంట్ఫైల్స్లో వాటిల్లిన లోపం వల్లే నీటి ప్రవాహం ఫౌండేషన్ కిందిగా కొనసాగి, ఇసుకను, మట్టిని తోడివేసిందని, తద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగుబాటుకు గురైందని ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్‌లో వెల్లడైంది. అంతే తప్ప బరాజ్‌లో మరేచోట ఇతర సాంకేతిక లోపాలు లేవని నివేదికలో తేలింది. 20వ పిల్లర్ పునాది కింద ఉన్న ఆ బొయ్యారాన్ని సిమెంట్, ఇసుక మిశ్రమంతో నింపడం (గ్రౌటింగ్) ద్వారా నీటి లీకేజీని అరికట్టవచ్చని, బరాజ్‌ను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవని అధికార వర్గాలు సైతం ఏనాడో వెల్లడించాయి. తాజాగా సీడబ్ల్యూపీఆర్ఎస్ సైతం ఇంచుమించు అదే అంశాన్ని వివరించింది. మేడిగడ్డ మినహా బరాజ్‌ల్లో సాంకేతిక లోపాలే లేవని వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) కుంగుబాటుకు గురైన ఘటనను సాకుగా చూపిన రేవంత్‌రెడ్డి సర్కార్.. కుట్రతో మొత్తం ప్రాజెక్టునే పడావు పెట్టింది. వాస్తవంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు సాగు, తాగునీటిని అందించవచ్చు. దీనిలో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్‌చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదలై యాదాద్రి జిల్లా బస్వాపుర్ రిజర్వాయర్ వరకూ జలాలను మళ్లించవచ్చు. మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, ఆ బరాజ్ నుంచి ప్రధాన గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు జలాలను తరలించవచ్చు.
అక్కడి నుంచి వరుసగా నందిమేడారం, లక్ష్మీపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వరం జలాశయం, అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్, రంగనాయకసాగర్‌కు, కొమురవెళ్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపుర్ రిజర్వాయర్ వరకు జలాలను తరలించవచ్చు. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ మొత్తంగా సంసిద్ధంగా ఉన్నది. తద్వారా ఎత్తిపోతలతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, నల్లగొండ, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు సాగునీటిని అందించడంతోపాటు మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటికీ ఢోకా లేకుండా అందించవచ్చు. కానీ మేడిగడ్డ ఘటనను సాకుగా చూపుతూ రైతాంగానికి ఆదరువుగా నిలిచే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం మొత్తంగా ఉద్దేశపూర్వకంగానే పడావు పెట్టిందని తెలిపోయింది.
మేడిగడ్డ ఘటనను సాకుగా చూపుతూ తొలి నుంచి కాంగ్రెస్ అసత్య ప్రచారానికి పూనుకున్నది. మంత్రులు ఒకసారి, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి.. ప్రాజెక్టును స్వయంగా సందర్శించి అక్కడా అవే ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు, ఒకవైపు విజిలెన్స్ విచారణకు, మరోవైపు జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించింది. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు తరచూ లీకులిస్తూ ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలకు దిగింది. రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతూ అబద్ధాల్లో మునిగి తేలుతూ రాష్ట్ర రైతులను ముంచుతున్నది.
మేడిగడ్డలో నీటిని నిల్వ చేయలేమని, మరమ్మతులు చేసిన తర్వాతే నీటిని ఎత్తిపోస్తామని, ఇక అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతాయని, బరాజ్‌ల దిగువన 40 గ్రామాలు, భద్రాచలం మునుగిపోతుందని ఇన్నాళ్లూ కాంగ్రెస్ దుష్ట ప్రచారం చేసింది. ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. నిర్మాణ ఏజెన్సీ ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్‌లను నిర్వహించగా, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులతో మరోసారి బరాజ్‌ల్లోని సాంకేతిక లోపాలపై అధ్యయనం చేయించింది.
తాజాగా సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలన్నీ మరోసారి పటాపంచలయ్యాయి. బరాజ్‌లు సురక్షితమని తేలిన నేపథ్యంలో వాటిని తక్షణం వినియోగంలోకి తీసుకొచ్చి గోదావరి నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్ ఊపందుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నాణ్యతపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన నివేదికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన కుట్రలన్నీ భగ్నమయ్యాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారాన్ని, కుట్రలను ఆ నివేదిక మరోసారి తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. బరాజ్‌లు అత్యంత నాణ్యతతో, అద్భుతంగా ఉన్నాయని సంస్థ స్పష్టం చేసిందని తెలిపారు. ఇకనైనా అసత్య ప్రచారం మానుకోవాలని, తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు.