హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబర్ సెక్యూరిటీ నియమాలు పాటించని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూ.60 లక్షల భారీ జరిమానా విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిఫారసు మేరకు ఆర్బీఐ ఈ చర్య చేపట్టింది. ఆన్లైన్ ద్వారా రూ.12.48 కోట్లు చోరీకి గురైనట్టు ఆ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది జనవరి 24న ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వర్లు, నెట్వర్క్ భద్రత కోసం ఆ బ్యాంక్ అధికారులు చర్యలు చేపట్టకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాన్ని ఆసరాగా చేసుకుని ఓ నైజీరియన్ గ్యాంగ్ ఆ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌చేసి డబ్బు మళ్లించుకున్నారని తేలింది. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించలేకపోయిన బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సీపీ సిఫారసు చేశారు. ఆర్బీఐ లైసెన్స్‌ను రద్దు చేయడం సాధ్యం కాక రూ.60 లక్షల భారీ జరిమానా విధించింది.