రేగొండ, నవంబర్ 20: ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉన్నదని విదేశీ బృందం ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆయిల్ పామ్ నర్సరీ, మండలంలోని రూపిరెడ్డిపల్లె, రేపాక గ్రామాల్లో రైతులు సాగు చేసిన క్షేత్రాలను పరిశీలించారు.
థాయిలాండ్‌కు చెందిన విత్తన సరఫరా ప్రతినిధి సరూత్, ఫ్రాన్స్‌కు చెందిన మార్కెటింగ్ హెడ్ జవియర్, బ్రీడర్, మలేషియాకు చెందిన నికోలస్ ఆయిల్ పామ్ సాగును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయి ల్ పామ్ సాగు వల్ల లాభాలు పొందొచ్చన్నారు. ఇందులో నాలుగేండ్లపాటు అంతర పంటలు సాగు చేసి అదనంగా డబ్బులు సంపాదించొచ్చని సూచించారు. పామాయిల్‌కు విదేశాల్లో మంచి గిరాకీ ఉన్నదని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసి రైతులు రాజు లా బతకొచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తూ సబ్సిడీ కూడా ఇస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.