Telangana projects | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ)/గజ్వేల్ అర్బన్: తెలంగాణలోని పలు భారీ జలాశయాలను, ఇతర ప్రాజెక్టులను సందర్శించిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఫిదా అయ్యారు. అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని కొనియాడారు. మల్లన్నసాగర్, కోమటిబండ మిషన్ భగీరథ సంప్‌హౌస్‌ను, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మారెట్, కొండపోచమ్మ సాగర్‌ను సందర్శించిన మీడియా ప్రతినిధులు మండుటెండల్లోనూ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎకడా లేనివిధంగా అనతి కాలంలోనే అత్యద్భుతమైన సాగునీటి రిజర్వాయర్లు నిర్మించడం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని కితాబిచ్చారు. జాతీయ మీడియా సంస్థల, ఈశాన్య రాష్ర్టాల జర్నలిస్టులు, పలు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీల రిపోర్టర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. మొదట సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌ను సందర్శించారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇంత ఎత్తుకు గోదావరి నీళ్లను తెచ్చి నిలువ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తకువ సమయంలో క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక ఉన్న ప్రణాళికను ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోమటిబండలో మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించారు. ఇంటింటికీ తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రాజెక్టు ఈఈ రాజయ్య వివరించగా, దీనిని దేశమంతా అమలుచేయాల్సిన అవసరం ఉన్నదని జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
గజ్వేల్‌లో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మారెట్ను నేషనల్ మీడియా ప్రతినిధులు సందర్శించారు. స్వచ్ఛమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాల నడుమ నాణ్యమైన, శుభ్రమైన కూరగాయలు, మాంసం, పండ్లు, పువ్వులు.. ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్నిరకాల వస్తువులు ఒకే చోట విక్రయించేలా మారెట్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. ఢిల్లీలో కూడా ఇలాంటి మార్కెట్ ఉన్నదని, కానీ ఇంత శుభ్రంగా లేదని ఓ మహిళా జర్నలిస్టు పేర్కొన్నారు. అనంతరం కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం పంప్‌హౌస్‌లను సందర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలను దేశమంతా అమలుచేస్తే అభివృద్ధి, సంక్షేమంలో దేశం ముందడుగు వేయడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడతాయని మీడియా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ర్టాల్లో అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఇందుకు ఈఎన్సీ హరిరామ్ సమాధానమిస్తూ ఇప్పటికే పంజాబ్ సీఎం, అధికారులు ఇక్కడి ప్రాజెక్టులను సందర్శించారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం, వినియోగం, రైతు పథకాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారని వివరించారు. పలు రాష్ర్టాల మంత్రులు, అధికారులు కూడా తెలంగాణలో పర్యటించి ప్రాజెక్టులు, అభివృద్ధిని పరిశీలించినట్టు చెప్పారు.
తెలంగాణలో అన్ని విధాలా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సీఎం కేసీఆర్ చాలా గొప్ప పనిచేశారు. సీఎం కేసీఆర్ గ్రేట్ పర్సన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి పడిపోతున్నాయి. గొప్ప ప్రాజెక్టులు నిర్మించి సముద్రాల్లోకి వృథాగా వెళ్తున్న నదీజలాలను ఒడిసిపట్టి వాటి ద్వారా రైతులు, ప్రజలకు సాగు, తాగునీరు అందించడం అద్భుతం. సమీకృత మార్కెట్ల ద్వారా రైతులు తమ పంటలు విక్రయించుకునే అవకాశంతోపాటు ప్రజలకు ఇక్కడే కొనుగోలు చేసేలా ఒక పద్ధతిని అలవాటు చేయడం చాలా బాగుంది. నీటి కరువుతో సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ర్టాలకు తెలంగాణ మాడల్. ఆయా రాష్ర్టాలకు వెళ్లి తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– సీమా గెల్, హర్యానా రాష్ట్ర మీడియా ప్రతినిధి
ఇలాంటి మార్కెట్ ఢిల్లీలో కూడా ఉన్నది. కానీ ఇంత శుభ్రంగా ఉండదు. ప్రజల దాహార్తి తీర్చడానికి ఇంటింటికీ తాగునీరు అందించడం చాలా సంతోషంగా ఉన్నది. మార్కెట్ బహుత్ అచ్చాహై. బహుత్ బడా కామ్ హువా… ఇతర రాష్ర్టాల్లోనూ ఇంతటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది.
– ఓపీపాల్, జాతీయ మీడియా ప్రతినిధి
ఇక్కడి అభివృద్ధి అద్భుతం. ఇంతగొప్ప అభివృద్ధి ఎక్కడా చూడలేదు. నెలరోజులపాటు వార్తా కథనాలు రాయడానికి నేను చాలా విషయాలు తెలుసుకున్నా. తెలంగాణలో అభివృద్ధి చాలా గొప్పగా జరిగింది. సీఎం కేసీఆర్ గ్రేట్. తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చాలా సంతోషాన్నిచ్చింది.
– జితేందర్ సింగ్, అమర్ఉజాలా దినపత్రిక, న్యూఢిల్లీ