జనగామ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): జనగామలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై తిరుపతి, తదితర పోలీసు సిబ్బందిని బదిలీ చేసి చేతులు దులుపుకోకుండా బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులే దొంగలుగా మారి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని, వారి దీక్షకు మద్దతు తెలుపుతున్నదని, న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు లంచాలకు మరిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఒక ఎమ్మెల్యేగా తనపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారం టే సామాన్య ప్రజలను ఇంకెంతగా వేధిస్తున్నారో తెలుస్తున్నదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తంచేశారు. దొంగలు, దోపిడీదారులను నియంత్రించాలని పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తే.. ఖాకీలే దొంగల పాత్ర పోషించి ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.