నూతనకల్, జనవరి 1: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపారు. ఒళ్లు కమిలేలా లాఠీలతో కొట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండల కేంద్రానికి చెందిన కాటూరి రాము డిసెంబర్ 31 రాత్రి స్నేహితులతో కలిసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చుని మందు తాగుతున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పెట్రోలింగ్‌లో భాగంగా అటువైపు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పారు. రాము మినహా మిగతా వాళ్లు వెళ్లిపోయారు. ‘ఈ ఇల్లు మాదే.. మేము ఎవరికీ ఇబ్బంది కలిగించడం లేదు’ అని రాము పోలీసులతో అన్నాడు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. కానిస్టేబుళ్లు ఫోన్లో ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి వచ్చి కనీస విచారణ చేపట్టకుండానే తనను బలవంతంగా పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్లి 15 నిమిషాలపాటు విచక్షణారహితంగా కొట్టినట్టు రాము వాపోయాడు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఎస్సై కొట్టిన దెబ్బలకు ఒళ్లంతా కమిలిందని మీడియా ఎదుట వాపోయాడు. ఈ విషయమై ఎస్సై మహేందర్నాథ్ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. పెట్రోలింగ్‌కు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కాటూరి రాము చెయ్యి చేసుకున్నట్టు తెలిపారు. వాళ్లు తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తాను అక్కడికి వెళ్లగా తన పట్ల కూడా దురుసుగా వ్యవహరించడంతో స్టేషన్‌కు తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే మందలించినట్టు తెలిపారు.