హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నల్లకుంట ప్రాంతంలో రూ.2 కోట్ల విలువైన ఇంటిని రూ.75 లక్షలకే అమ్మేశాడో వ్యక్తి. కానీ, అతను ఓనర్ కాదు. నకిలీ పత్రాలతో కథ నడిపాడు. అసలు యజమాని ఆన్లైన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేందుకు ప్రయత్నిస్తే.. ఈ విషయం బయటపడింది. తెల్లాపూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాహకుడు విజయ్‌కుమార్ తల్లిదండ్రులకు నల్లకుంటలో ఓ ఇల్లు ఉన్నది. రెండేండ్ల క్రితం వరకు అకడే నివసించిన విజయ్ తల్లిదండ్రులు కొవిడ్ నేపథ్యంలో కుమారుడి వద్దకు మకాం మార్చారు. ఆ ఇంటి మీద కన్నేసిన కొడవత్ నాగనాయక్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, దానిని అమ్మేశాడు. ఇటీవల విజయ్ తమ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేందుకు జీహెచ్ఎంసీ వెబ్సెట్లో ప్రయత్నించగా ఆ ఇల్లు బత్తిని భాసర్గౌడ్, బత్తిని భువనేశ్వరి పేర్లతో ఉన్నట్టు కనిపించింది.
తొలుత షాక్ తిన్న విజయ్.. వెబ్సెట్లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయడంతో భాస్కర్‌గౌడ్ లైన్లోకి వచ్చారు. ఆ ఇంటిని నాగనాయక్ నుంచి కొనుగోలు చేశానని చెప్పి, ఫోన్ నంబర్ ఇచ్చారు. నాగనాయక్కు ఫోన్ చేయడంతో.. ఆ ఇంటిని 1978లోనే విజయ్ తల్లి తమకు అమ్మిందని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీసీ దామోదర్‌రెడ్డి నేతృత్వంలో కేసును ఛేదించిన పోలీసులు నాగనాయక్ను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అతడికి సహకరించిన మరికొందరి కోసం గాలిస్తున్నారు. నాగనాయక్ గతంలో ఒక హత్య కేసులో జైలు శిక్ష కూడా అనుభవించినట్టు పోలీసులు గుర్తించారు.