Oil Palm | నిర్మల్, మే 27 (నమస్తే తెలంగాణ): రైతులను లాభాలబాట పట్టించేందుకు కేసీఆర్ సర్కారు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్‌పామ్ మొక్క నాటితే నాలుగో యేట నుంచి దాదాపు 20 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని విస్తృతంగా ప్రచారం చేయగా, రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకొచ్చారు. ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులకోసారి రైతుకు డబ్బులు వచ్చే పంట, పర్యావరణానికి మేలు చేసే పంట కావడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించింది. ఈ పంట సాగుకు నీటి వినియోగం, విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. ఎకరం వరి పంటకు అవసరమయ్యే నీటితో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఆయిల్ పామ్ తోటలను పెంచుకునే అవకాశం ఉంది.
దీంతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను పెంచాలనే బృహత్ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో 32 జిల్లాలను 13 ఆయిల్‌పామ్ కంపెనీలకు కేటాయించి అవసరమైన ప్రోత్సాహకాలను అందజేసింది. ఆయా కంపెనీలు ప్రతి జిల్లాలో నర్సరీలను ఏర్పాటు చేసి మొదటి ఏడాదిలోనే 50 లక్షలకు పైగా మొక్కలను పెంచి రైతులకు ఊరూరా అందజేశాయి. ఆయిల్‌పామ్ దిగుబడులను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు దాదాపు అన్ని జిల్లాల్లో పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయతలపెట్టింది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో దాదాపు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి రూ.300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో ఆరు నెలలుగా పరిశ్రమ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో తమ పంట ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
నిర్మల్ జిల్లాలో రెండేండ్లలో 7 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేశారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు 2021 నుంచి దాదాపు మూడేండ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.4200 చొప్పున ఇన్సెంటివ్ను కూడా అందించింది. ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన డ్రిప్ సిస్టమ్‌తో పాటు నిరంతర కరెంటు, ఇతర సాంకేతిక సదుపాయాలను కల్పించింది. సారంగాపూర్ మండలం బీరవెల్లి నర్సరీ ద్వారా జిల్లాలోని వివిధ గ్రామాల రైతులకు సబ్సిడీపై మొక్కలను అందించారు. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చి ఆరునెలలు అయినా ఆయిల్‌పామ్ సాగుపై సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. రైతులకు వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి సహకారం, ప్రోత్సాహకాలు మంజూరు కావడం లేదు. శంకుస్థాపనకే పరిమితమైన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో అడుగు కూడా ముందుకు పడలేదు. పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ప్రీ-యూనిక్ కంపెనీపై ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కరెంటు కోతల కారణంగా ఆయిల్‌పామ్ మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పదేండ్లుగా ఒక వ్యవస్థకు అలవాటుపడ్డ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పామాయిల్ సాగును చేపట్టేలా రైతులను ప్రోత్సహించారు. 2021-22 సంవత్సరంలో 80 వేల ఎకరాలు, 2022-23లో 65 వేల ఎకరాలు, 2023-24లో 55 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేశారు. కాంగెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్‌పామ్ సాగుపై సమీక్షించలేదు. ఎకరానికి రూ. 4200 ఇన్సెంటివ్ ఇవ్వడంలేదు. కరెంటు సక్రమంగా రాకపోవడం, బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఆయిల్‌పామ్ సాగుపై సీఎం హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలివ్వాలి. 24 గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలి. ఇన్సెంటివ్‌లు, 90 శాతం సబ్సిడీతో ఫాం పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను అందించి, పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.