హైదరాబాద్/ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ: రాష్ట్రంలో కొత్త వాహనాల నంబర్లు ఇకపై టీజీతో మొదలుకానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్‌కు రాష్ట్ర రవాణాశాఖ స్వస్తి పలికింది. శుక్రవారం టీజీ నంబర్ ప్లేట్‌ను విడుదల చేయనున్నది. ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుమతి ఇచ్చింది. దాంతో టీజీ నంబర్ పేట్ల జారీకి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో రవాణాశాఖ అధికారులు శుక్రవారం నుంచి టీఎస్ స్థానంలో టీజీ నంబర్ పేట్లను తీసురాబోతున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకే టీజీ వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల కోడ్స్ కూడా యథావిధిగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 0001 నుంచి సిరీస్ మొదలవుతుంది. ఖైరతాబాద్ ఆర్టీవో పరిధిలో ‘టీజీ 09 0001’ నంబర్ నుంచి సిరీస్ జారీ చేస్తారు. ఈ నంబర్ 9999 పూర్తయిన అనంతరం టీజీ 09A 0001తో సిరీస్ ప్రారంభమై 09A 9999తో ముగుస్తుంది. అనంతరం టీజీ 09B0001తో సిరీస్ మొదలై.. ఇలా జడ్ వరకు సిరీస్ కొనసాగిన అనంతరం టీజీ 09AA 0001తో సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి టీజీ నంబర్లు విడుదలవుతాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
టీఎస్ వాహనదారులు టీజీ నంబర్ ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఒకవేళ టీజీ నంబర్ ప్లేట్ తీసుకోవాలంటే.. ఆ వ్యక్తికి ఉన్న మోటార్ కారును కన్వర్షన్ చేసుకోవాలి. అంటే క్యాబ్‌గా మార్చు కోవాలి. అప్పడు యెల్లో నంబర్ ప్లేట్ జారీ చేస్తారు. మళ్లీ దానిని వ్యక్తిగత వాహనంగా మార్చుకోవచ్చు. ఆ సమయంలో ఆర్టీవో కార్యాలయం టీజీ నంబర్ ప్లేట్ జారీ చేస్తుంది. రెండో ప్రక్రియలో ఏ వాహనమైనా సరే సంబంధిత ఓనర్ ఆర్టీవో నుంచి ఎన్వోసీ తీసుకొని ఇతర రాష్ట్రానికి వెళ్లాలి. అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు వాళ్లు వాళ్ల రాష్ట్రం నంబర్ ఇస్తారు. అనంతరం మళ్లీ ఎన్వోసీ తీసుకొని మన రాష్ర్టానికి రావాలి. మళ్లీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు కొత్తగా టీజీ నంబర్ ప్లేట్ ఇస్తారు.
వాహనాల రిజిస్ట్రేషన్‌ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా ప్రజల ఆకాంక్ష మేరకే టీఎస్ నుంచి టీజీగా మార్చుతున్నామని తెలిపారు. గురువారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీజీ అనే పదంలోనే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నదని చెప్పారు.