చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొంత మంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.