హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : కాలుష్య నియంత్రణ మండలి కార్యకలాపాలు నిర్వర్తించే ఉన్నతాధికారికి కనీస సమాచారం లేకుండా కిందస్థాయి ఉద్యోగులు నేరుగా పర్యావరణ మంత్రితో పదవులు పొందడం విస్మయానికి గురిచేస్తున్నది. అటు మంత్రి పేషీలో.. ఇటు కాలుష్యనియంత్రణ మండలిలో ఏం జరుగుతుందో మెంబర్ సెక్రటరీకి తెలియడం లేదంటే పైరవీ లు ఏస్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తున్నది. ఇటీవల జరిగిన నేషనల్ గ్రీన్కార్ప్స్ ఇన్చార్జి డైరెక్టర్ నియామకమే అందుకు చక్కటి ఉదాహరణ. ఏండ్ల తరబడి హెడ్ఆఫీస్లో తిష్టవేసి మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులను మేనేజ్ చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించడమే అందుకు నిదర్శనమని పీసీబీలో విస్తృత చర్చ జరుగుతున్నది.
పీసీబీ ప్రమేయం లేకుండా పర్యావరణ మంత్రి ఎన్జీసీ డైరెక్టర్‌ను మార్చడం వెనుక ఆంతర్యమేంటనే గుసగుసలు పీసీబీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. మెంబర్ సెక్రటరీ స్థాయిని దిగజార్చేలా మంత్రి నిర్ణయం తీసుకోవడంతో పైరవీ ముచ్చట్లు బహిర్గతమవుతున్నాయి. డైరెక్టర్ బాధ్యతలు సదరు అధికారికి ఇవ్వొచ్చని టెక్నికల్‌గా నిరూపించడానికి సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ హోదాను కాకుండా మరో అదనపు బాధ్యత ఎన్‌క్యాప్ రాష్ట్ర నోడల్ అధికారి అని మెన్షన్ చేసినట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఎన్జీసీ ద్వారా రాష్ర్టానికి వచ్చే రూ.కోట్ల నిధుల్లో కమీషన్లు తీసుకోవడానికి అవకాశాలుంటాయని, ఈ వ్యవహారమంతా మాజీ ఓఎస్డీ నడిపించినట్టు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్జీసీ డైరెక్టర్ ఇన్చార్జి బాధ్యతలు పొం దిన సీనియర్ ఎన్విరాన్మెంటల్ అధికారి ‘తనకు బాధ్యతలు వద్దన్నా ఇచ్చారని, దానికి నేనేం చేయాలని..’ మెంబర్ సెక్రటరీతోనే అన గా పీసీబీ అధికారులు నోరెళ్లబెట్టినట్టు సమాచారం. ఆయన తర్వాత పదిమంది సీనియర్లు ఉన్నా కాదని పదవి కట్టబెడతారా? ఆయన లో అంత స్పెషల్ ఏముంది? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రి మాజీ ఓఎస్డీకి భారీగా ముడుపులు అందినట్టు ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఇప్పటికీ మంత్రి స్పందించకపోవడంపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.