చిక్కడపల్లి, ఏప్రిల్ 9: చేనేత రంగంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. చేనేతలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. చేనేతవర్గాల చైతన్యవేదిక, బీసీ మేధావులు ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ‘చేనేతకు టెండర్ గండం-ప్రభుత్వ నిరంకుశ నిర్ణయంపై ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని, కాంట్రాక్టర్లు, కమీషన్లపైనే దృష్టి ఉన్నదని ఆరోపించారు. ఈ రెండేండ్ల బడ్జెట్ కేటాయింపుల్లో చేనేత రంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ చేనేత వర్గాలు, బీసీల పట్ల తీవ్ర వివక్షత చూపుతున్నారని విమర్శించారు. చేనేత కార్మికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై త్వరలోనే జేఏసీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. చేనేత చైతన్యవేదిక జాతీయ అధ్యక్షుడు చిక్క దేవదాసు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత చేనేతపైనే ఉక్కుపాదం మోపుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంక్షేమ పథకాల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో గీత కార్మికులను ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు చేనేత కార్మికులు హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బీసీ వర్గాలు ఐకమత్యంతో హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రభుత్వం సహకార రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్, నాయకులు వెంకన్న, గుజ్జ సత్యం, శాంతి, వెంకటేశం, ఎయిర్టెల్ రాజు, లక్ష్మీనర్సయ్య, చిన్న శ్రీకాంత్, సరస్వతి, అయిలి వెంకన్నగౌడ్, అంబాల నారాయణగౌడ్ పాల్గొన్నారు.