NEET UG | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్యావిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష విద్యార్థులకు చుక్కలు చూపించింది. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. నీట్ పరీక్షలో ఈ సారి ప్రశ్నలు అత్యంత కఠినంగా ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఫిజిక్స్ ప్రశ్నలు యమగొట్టుగా ఇచ్చారు. ఫిజిక్స్‌లో 45 ప్రశ్నలివ్వగా, చాలా మంది విద్యార్థులు 25-30 ప్రశ్నలతోనే అగిపోయారు. మిగతా ప్రశ్నలకు ఆన్సర్లు చేయలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. టాపర్లు కూడా 45 ప్రశ్నలకు ఆన్సర్లు రాయలేకపోయారంటే ప్రశ్నలెలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టాపర్లు 40 ప్రశ్నలకే సమాధానాలు రాశారు. కొంత కాలంగా నీట్లో ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగానే ఇస్తున్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలే కఠినంగా ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఈ సారి అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఫిజిక్స్ ప్రశ్నలు అత్యంత కఠినంగా ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. పలువురు విద్యార్థులు సెంటర్ల వద్దే రోదించడం కనిపించింది.
ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీలో ఇచ్చిన ప్రశ్నలు కూడా కఠినంగానే ఇచ్చారు. ఈ విభాగంలో 7-10 ప్రశ్నలు పొడవుగా, అత్యంత కఠినంగా ఇచ్చారు. జువాలజీలోనూ 3-4 ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. నాలుగు విభాగాల్లో బోటనీ ఒక్కటే కాస్త సులభంగా ఉంది. బోటనీలో 50 ప్రశ్నలు సులభంగా ఉండటంతో విద్యార్థులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిరుటితో పోల్చితే అత్యంత కఠినంగా ప్రశ్నలిచ్చినట్టు నీట్ శిక్షకుడు శంకర్రావు అభిప్రాయపడ్డారు.
పేపర్ కఠినంగా రావడంతో నీట్లో ఈ సారి 720కి 720 మార్కులు రావడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిరుడు పేపర్ అత్యంత సులభంగా రావడంతో జాతీయంగా 54 మంది 720 మార్కులు సొంతం చేసుకున్నారు. 700కు పైగా మా ర్కులు పొందిన వారు వందల్లో ఉన్నారు. తెలంగాణలో 500 మార్కులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీటు వచ్చిన దాఖలాలున్నాయి. ఈ సారి పేపర్ కఠినంగా రావడంతో తెలంగాణలో కటాఫ్ 440-450 మార్కులుండే అవకాశముంది. పరీక్షాకేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదని విద్యార్థులు ఆరోపించారు. కొన్ని సెంటర్లలో మాత్రమే గోడ గడియారాలున్నాయని, కూకట్‌పల్లిలోని పలు సెంటర్లలో గోడ గడియారాలు ఏర్పాటు చేయలేదని విద్యార్థులు ఆరోపించారు. ఓ సెంటర్లో ఐదు నిమిషాల ముందే పేపర్లు తీసుకున్నట్టు పేర్కొన్నారు. నీట్ పరీక్షను తల్లీ, కూ తురు రాశారు. కూతురు కావేరి ఖమ్మంలో, తల్లి సరిత సూర్యాపేటలో పరీక్ష రాశారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం మంచనాయక్తండా వీరి స్వగ్రామం. 2007లో బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన సరిత స్వగ్రామంలోనే ఆర్ఎంపీగా చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన వైష్ణవి ఆమె తల్లితో కలిసి కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కళాశాలలోని సెంటర్‌కు మూడు నిమిషాలు ఆలస్యంగా హాజరుకాగా, అప్పటికే అధికారులు గేటు మూసివేశారు. తల్లి, కూతురు ఇద్దరు గేట్ వద్దే రోదించడం అక్కడున్నవారిని కలిచివేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేటకు చెందిన సీహెచ్ నవ్య, ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ పరీక్ష కేంద్రానికి కూసుమంచికి చెందిన ఓ విద్యార్థిని, ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి, హైదరాబాద్ నుంచి వచ్చిన మరో విద్యార్థి, నంగునూరు నుంచి వచ్చిన ఒక విద్యార్థి సిద్దిపేటలోని పరీక్ష కేంద్రంలోకి ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు రోదిస్తూ వెనుదిరిగారు.