హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, బీవరేజీల్లో ఉండే షుగర్ పరిమాణంపై జాతీయ పోషకాహార సంస్థ స్పష్టమైన సూచనలు చేసింది. ఘన పదార్థాల్లో షుగర్ కంటెంట్ 10 శాతానికి మించకూడదని నిర్దేశించింది. ఇటీవల ఆహారం- పానియాల్లో (ఫుడ్, బేవరేజీ) పరిమితికి మించి చక్కెర కంటెంట్ ఉండటం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి, నియంత్రించేలా ఆహార నియామావళిని రూపొందించింది. మారుతున్న జీవనశైలి, ఆహార పదార్థాల ఆధారంగా దశాబ్దకాలంగా ఉన్న ఆహార మార్గదర్శకాలను ఐసీఎంఆర్-జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల పోషకాహార నియామావళిని అప్డేట్ చేసింది. ఆహారంలో అధిక చక్కెర వల్ల కలిగే దుష్ప్రరిణామాలపై అవగాహన కల్పించడంతోపాటు నియంత్రణకు కూడా స్పష్టమైన సూచనలు చేసింది.
ఇటీవల ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్, బీవరేజీల వినియోగం పెరిగినందున ఘన ఆహారాల్లో 5-10 శాతానికి మించి యాడెడ్ షుగర్ ఉండకూడదని సూచించింది. బీవరేజీల్లో ఉండే మొత్తంలో ఎనర్జీలో 10-30 శాతానికి మించి యాడెడ్ షుగర్ ఉండకూడదని పేర్కొన్నది. తాజాగా రూపొందించిన డైటరీ గైడ్ లైన్స్ ఆధారంగా ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను నియంత్రించేలా వీటి ద్వారా శరీరంలో చేరుతున్న చక్కెర పరిమాణాన్ని తగ్గించుకొనేలా నిర్దేశించింది. ఈ సూచనలతో ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ సంస్థలు కూడా ఆహార పదార్థాలను రూపొందించుకోనున్నాయి. ఇప్పటికే హార్లిక్స్, బూస్ట్, బోర్న్‌విటా వంటి పౌడర్లను హెల్దీ డ్రింక్ జాబితా నుంచి తొలగించింది. బోర్న్‌విటా గతేడాదిలోనే షుగర్ కంటెంట్‌ను తగ్గించింది.
తయారీ సంస్థలు తప్పనిసరిగా ప్యాకేజింగ్ కవర్లపై ఫుడ్ లేబుల్స్‌ను ప్రచురించాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, వాటిపై వినియోగదారులకు అవగాహన తక్కువే. ఈ నేపథ్యంలోనే ఫుడ్ లేబుల్స్‌పై ఆహార పదార్థాల వివరాలను చూడాలని, వీటి ఆధారంగానే తినేందుకు ఎంపిక చేసుకోనేలా అవగాహన పెంచుతుంది. ఇప్పటికే లేబుల్స్‌పై చదివాలని ఆహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.