హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రజాకార్ సినిమా విడుదలను నిలిపివేయాలని సీపీఐ జాతీయ నేతలు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని చెప్పారు.
ఎన్నికల సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి రజాకార్ సినిమాకు ఫైనాన్స్ చేశారని చెప్పారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిందని, కానీ బీజేపీ సాయుధ పోరాటాన్ని విముక్తి పోరాటంగా చూస్తోందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాల వల్ల చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఆ సినిమా విడుదలైతే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టవుతుందని నారాయణ సూచించారు.