Bollampally Kanakalakshmi | తిమ్మాపూర్, మే 16: ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి గుండె ఆగిపోయింది. కొడుకు అంత్యక్రియలు జరిగిన గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్‌లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేదునూర్‌కు చెందిన బొల్లంపల్లి కనుకలక్ష్మి, కనుకయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు శ్యాంసుందర్(35) ఉన్నారు.
శ్యాంసుందర్ గాయకుడిగా జీవనం సాగించాడు. ఏడాది కిందట హుస్నాబాద్‌కు చెందిన శారదతో పెద్దలు వివాహం జరిపించగా.. పెళ్లి అయిన కొద్ది రోజులకే ఆమె తన తల్లిగారింటి వద్ద ఆత్మహత్య చేసుకున్నది. ఈ క్రమంలో తన పెళ్లిరోజైన ఈ నెల 15న తెల్లవారుజామున శ్యాంసుందర్ సైతం హుస్నాబాద్‌కు వెళ్లి భార్య ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే పురుగుల మందు తాగాడు.
అపస్మారక స్థితికి చేరుకోవడంతో గమనించిన స్థానికులు దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించి అదేరోజు మృతిచెందాడు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే సోమవారం సాయంత్రం నేదునూర్‌లో అంత్యక్రియలు జరిపించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో రాత్రంతా రోదిస్తూనే ఉన్న తల్లి కనుకలక్ష్మి (58)కి అర్ధరాత్రి సమయంలో గుండె నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వెంటనే కరీంనగర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది.