రామన్నపేట, నవంబర్ 6: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల 84 ఏళ్ల వయస్సులో పుస్తకాలను ప్రేమిస్తూ తన సంపాదనంతా గ్రామంలో గ్రంథాలయ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారని కొనియాడారు.
విఠలాచార్య జన్మించిన సంవత్సరమే తండ్రిని కోల్పోయారని పేర్కొన్నారు. చదువుకునే రోజుల్లో పుస్తకాలు కొనుక్కునే స్థోమతలేక స్నేహితుల వద్ద అరువుగా తీసుకొని చదువుకున్నారని, ఆయనలా మరెవరికీ ఇబ్బంది రావొద్దని 2 లక్షల పుస్తకాలతో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.