 
                                                            Rain alert | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించి, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాగల 24 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్యం, పడమర దిశల నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు పెరిగాయి. ఉదయం 7 గంటల నుంచే వేడిగాలులు మొదలై, మధ్యాహ్నం తీవ్రం అవుతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.
 
                            