హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని పాఠశాలలు, కళాశాలల్లో కిచెన్ బాధ్యతలను విద్యార్థులతో నిర్వహించాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి వర్షిణి శుక్రవారం ప్రిన్సిపాల్స్‌తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి పలు ఆదేశాలు జారీచేశారు. గురుకుల కిచెన్ బాధ్యతలపై చర్చించారు. ప్రస్తుతం గురుకుల వార్డెన్ కమ్ కేర్‌టేకర్‌గా ప్రిన్సిపాల్ కొనసాగుతున్నారు. వారి పర్యవేక్షణలోనే టీజీటీ, పీజీటీలు డిప్యూటీ వార్డెన్, అసిస్టెంట్ కేర్ టేకర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి కేర్‌టేకర్, అసిస్టెంట్ కేర్‌టేకర్ వ్యవస్థను తీసేస్తున్నట్టుగా సమావేశంలో వర్షిణి స్పష్టంచేశారు. మెస్ బాధ్యతలను విద్యార్థులకే అప్పగించనున్నట్టు తెలిపారు. ప్రతినెలా విద్యార్థులతో 3 డైట్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఒక కమిటీ మెస్ ఇండెంట్ పెట్టడం, రెండో కమిటీ వంట సామగ్రి భద్రపరచడం, వంట సిబ్బందికి ఇవ్వడం, మూడో కమిటీ కుకింగ్ బాధ్యతలను నిర్వర్తించేలా చూడాలని సూచించారు. గురుకుల ఇంటర్ ప్రవేశాలను జూన్ 15వ తేదీలో పూర్తి చేస్తామని తెలిపారు. డైట్ కమిటీలు ఏర్పాటు నిర్ణయంపై ప్రిన్సిపాళ్లు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.