హైదరాబాద్ సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీసీహెచ్) పరిధిలోకి తీసుకొచ్చే బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన కోఠిలోని డీఎంఈ ఆవరణలో టీవీవీపీ, డీహెచ్, డీఎంఈ పరిధిలోని వైద్యులు, స్టాఫ్‌నర్సులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే వైద్య సిబ్బంది సకాలంలో జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వైద్య వృత్తిలో ఉండి కూడా పిల్లలకు స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటివరకు ఈ నెల జీతాలు తమకు అందలేదని చెప్పారు. టీవీవీపీ కమిషనర్, ఫైనాన్స్ విభాగం అసమర్థత వల్లనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడంలేదని పేర్కొన్నారు. కార్పొరేషన్ వ్యవస్థలో ఉన్న టీవీవీపీని పూర్తిగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోకి తీసుకొనిరావడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీవీవీపీలో జీడీఎంవో నుంచి స్పెషలిస్టులకు కన్వర్షన్ ప్రక్రియను తక్షణమే అమలుచేయాలని, నూతనంగా ఏర్పాటుచేసిన అన్ని మెడికల్ కళాశాలల్లో పెరిఫెరల్ మెడికల్ కాలేజీ అలవెన్స్‌లను మంజూరు చేయాలని, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌ను అందరికీ అమలుచేయాలని, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీఏఎస్ ప్రమోషన్ ఆర్డర్లను వెంటనే జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందికి నిమ్స్ పేస్కేల్‌ను అమలుచేయాలని, రెగ్యులర్ రిక్రూట్మెంట్కు ముందు సరెండర్స్‌ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో జీవో-142 సవరణను వెంటనే అమలుచేయాలని కోరారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏవో)లకు అపరిమిత అధికారాలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ఆఫీసర్లను దవాఖానల్లో పరిపాలనాధికారులుగా నియమించి, వారికి అపరిమిత అధికారులు ఇవ్వడం వల్ల సూపరింటెండెంట్లుగా పనిచేసే వైద్యాధికారుల ఆత్మగౌరవం దెబ్బతింటున్నదని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ, ఈహెచ్సీఎస్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు.
టీవీవీపీకి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోతే టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీజీజీడీ సెక్రటరీ జనరల్ డాక్టర్ లల్లూప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ దీన్‌దయాల్, కార్యదర్శులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ రాంసింగ్, ఉస్మానియా యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణారెడ్డి, ఉస్మానియా యూనిట్-2 అధ్యక్షుడు డాక్టర్ వినోద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంధ్య, హైదరాబాద్ యూనిట్-1 అధ్యక్షుడు డాక్టర్ సంతోష్‌బాబు, హైదరాబాద్ పీయూ-2 అధ్యక్షురాలు డాక్టర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.