హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవటం, మధ్యపానం, శారీరక శ్రమ లేకపోవటం వల్లనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ (ఎస్సీఎస్) మొదటి అంతర్జాతీయ వార్షిక సమావేశం నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సీఎస్ అధ్యక్షుడు డాక్టర్ లోకేశ్వర్‌రావు సజ్జ, కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ గోపీచంద్ మన్నంతోపాటు సుమారు 100 మంది అంతర్జాతీయ స్థాయి కార్డియాలజీ వైద్యనిపుణులు పాల్గొని ప్రసంగించారు.
శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) పెరగటానికి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులే కారణమని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రతగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. లోకేశ్వర్‌రావు సజ్జా మాట్లాడుతూ కరోనరి ఆర్టరీ బైపాస్ సర్జరీలో పురోగతి తీసుకురావడమే ఎస్సీఎస్ తొలి సమావేశం ముఖ్య ఉద్ధేశ్యమని తెలిపారు.