హైదరాబాద్, అక్టోబర్25 (నమస్తే తెలంగాణ) : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిర్వహణను ఆధునికీకరించనున్నారు. అధునాతన స్కాడ(సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సిస్టమ్‌తో అనుసంధానం చేయనున్నారు. దాదాపు రూ.2 కోట్ల అంచానా వ్యయంతో ఈ పనులను ప్రతిపాదించగా ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్) కమిటీ ఆమోదం తెలిపింది.
జలసౌధలో ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు నేతృత్వంలో కమిటీ సమావేశం శుక్రవారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రాజెక్టుల్లో పలు కాల్వలు, పంపింగ్ స్టేషన్లు, చెరువులకు సంబంధించి దాదాపు రూ.5 కోట్ల అంచనాలతో రూపొందించిన ఓఅండ్ఎం పనులపై కమిటీ ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపింది.