హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు లూకస్ అధికార మదంతో బరితెగించాడు. ఉప్పల్‌లోని లక్ష్మీనారాయణ కాలనీలో తన ఇంటి ముందు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారన్న చిన్న కారణంతో బీహార్‌కు చెందిన ఓ గిరిజన కుటుంబంపై ఆగ్రహంతో ఊగిపోయాడు. బూతులు తిడుతూ ఆ పిల్లల తండ్రిని చితక బాదాడు. అడ్డొచ్చిన తల్లిపై కూడా బట్టలు చిరిగేలా దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తన రాజకీయ బలంతో పోలీసులను పిలిపించి బాధితులనే పోలీస్ స్టేషన్లో నిర్బంధించాడు. పైపెచ్చు వారే తనపై గొడవకు దిగారని, ఆ గొడవలో తన బంగారు గొలుసు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితులు..
ఆయనే తమను కొట్టాడని నెత్తీనోరు బాదుకుంటూ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు చూపినా పట్టించుకోని పోలీసులు ‘సార్’ (లూకస్) ఎలా చెబితే అలా చేద్దామంటూ బాధితులపై ఒత్తిడి తెచ్చారు. అనంతరం తన కాళ్లు మొక్కాలని, అప్పుడే ఫిర్యాదును వాపస్ తీసుకుంటానని లూకస్ బెదిరింపులకు దిగడంతో ఆ దంపతులు ఏమీ చేయలేక పోలీస్ స్టేషన్లోనే ఆయన కాళ్లు మొక్కి అక్కడి నుంచి బయటపడినట్టు తెలిసింది. ఈ నెల 22 అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఆ రోజు గొడవ జరిగిన మాట వాస్తవమేనని, దానిపై అదే రోజు రాత్రి ఇరువర్గాలు తమ సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారని పోలీసులు చెప్తున్నారు. ఆ దంపతులతో లూకస్ కాళ్లు మొక్కించిన మాట వాస్తవం కాదని ఉప్పల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి పేర్కొంటూ ఆ ఘటనను తక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. మహిళ అని చూడకుండా చితకబాదడం, ఆపై బాధితులపైనే కేసు పెట్టేందుకు ప్రయత్నించడంపై మాత్రం పోలీసులు నోరు మెదపడం లేదు. కాగా, ఆ దంపతులపై దాడి చేయడంపై కేసు నమోదైనట్టు ఉప్పల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.