హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విభాగం రూపొందించిన నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ దృష్టి సారించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా నాలుగవ రోజైన గురువారం ప్రాజెక్టు పునరుద్ధరణ, పనుల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాలజీ, డిజైన్స్, తదితర నిపుణుల కమిటీ సభ్యులను జస్టిస్ ఘోష్ విచారించారు. బరాజ్గా నిర్మించి ఎకువ నీటిని నిల్వ చేసినందువల్లే సమస్య వచ్చిందని నిపుణులు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్కు చెప్పినట్టు సమాచారం.
ప్రాజెక్టు పరిశీలనకు సంబంధించి రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని కమిషన్ ఆదేశించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే అఫిడవిట్ల పరిశీలన తరువాత బీఆర్కే భవన్లోనే బహిరంగ విచారణ చేపట్టనున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సాంకేతిక అంశాల తర్వాతే ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తుందని కమిషన్వర్గాలు తెలిపాయి. అధికారులు, ఏజెన్సీల ద్వారానే కాకుండా ఇతర రూపాల్లో కూడా సమాచారం సేకరిస్తుండడంతోపాటు ఆకస్మిక పర్యటనలకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతుందని సమాచారం.