ఇందల్వాయి, మే 29: దొంగల ముఠా కారుపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా ఈ ముఠా పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ కాపర్ తీగలు చోరీ చేస్తూ.. ఇటు రైతులకు.. అటు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నది. ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు రెండు నెలలుగా గాలిస్తున్నారు. దొంగతనాల్లో ముఠా వాడిన ఓ కారును పోలీసులు అనుమానించారు. ఆ కారు సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్టు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ చేశారు.
టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ధర్పల్లి సీఐలతోపాటు డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి ఎస్సైలు, సిబ్బందితో కలిసి ఇందల్వాయి స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానిస్తున్న (రాజస్థాన్‌కు చెందిన) కారును గమనించిన ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి దానిని ఆపే ప్రయత్నం చేశారు. ఆ కారు బారికేడ్లను ఢీకొట్టుకుంటూ తనపైకి దూసుకు రావడంతో.. ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అక్కడి పోలీసులు అప్రమత్తమై కారును వెంబడించారు. నలుగురు ముఠా సభ్యులు కామారెడ్డి జిల్లా మల్లుపేట వద్ద కారును వదిలేసి పారిపోయారు. నిందితులు రాజస్థాన్ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.