మందమర్రి రూరల్, డిసెంబర్ 17 : ఇంటికి మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న ఆరుగురు సజీవదహనమయ్యారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గుడిపెల్లి ఎమ్మెల్యే కాలనీలో మాసు శివయ్య, పద్మ దంపతులు నివాసముంటున్నారు. శనిగారపు శాంతయ్య అనే వ్యక్తి కూడా కొంతకాలంగా వీరితోనే కలిసి ఉంటున్నాడు. గడ్డం మౌనిక.. పద్మకు బంధువు. రెండు రోజులు ఉండిపోదామని మౌనిక తన ఇద్దరు పిల్లలతో కలిసి వీరింటికి వచ్చింది. శుక్రవారం రాత్రి వీరంతా భోజనం చేసిన తరువాత నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో వీరి ఇంటికి మంటలు అంటుకున్నాయి.
వేడికి పెంకులు పగిలిన చప్పుడు రావడంతో స్థానికులు బయటికొచ్చి చూసే సరికి మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. వారంతా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే మాసు శివయ్య (52), మాసు పద్మ (45), శనిగారపు శాంతయ్య (54), గడ్డం మౌనిక (25), చిన్నారులు ప్రశాంతి (4), హిమబిందు (18 నెలలు) మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఆ ఇంటి సమీపంలో ఒక ఆటోతోపాటు రెండు పెట్రోల్ క్యాన్లు, కారం పొడి, పెట్రోల్ పోసేందుకు అనువుగా కట్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లు దొరికాయి. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారమే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసును త్వరగా ఛేదించేందుకు 16 బృందాలను రంగంలోకి దింపారు. అనుమానితులైన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.
పద్మ, శనిగారపు శాంతయ్యకు పదేండ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. గోదావరిఖనికి చెందిన శాంతయ్య సింగరేణి ఆర్కే-5 గనిలో బొగ్గు కార్మికుడిగా పని చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రి తం ఆయన తన భార్య, పిల్లలను వదిలేసి పద్మ ఇం ట్లోనే ఉంటున్నాడు. కొన్ని నెలల్లో శాంతయ్య రిటైర్ కావాల్సి ఉన్నది. ఈ క్రమంలో కారుణ్య నియామకం కింద శాంతయ్య ఉద్యోగం, రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుల విషయంలో ఆయన భార్య, కుమారులు.. పద్మ కుటుంబానికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ కారణంగానే శాంతయ్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.