హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతి గ్రామానికో చరిత్ర ఉన్నదని, వాటిని భావితరాలకు అందించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బైరాన్ నుంచి జనగామ వరకు, కడవెండి నుంచి జంగిలిగొండ వరకు గ్రామాలు మహోజ్వలమైన చరిత్రను కలిగి ఉన్నాయని చెప్పారు. రచయిత గుండెల రాజు రాసిన మహబూబాబాద్ ‘జంగిలిగొండ గ్రామ చరిత్ర 1949-2021’ పుస్తకాన్ని గౌరీశంకర్ సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆదివారం ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘జంగిలిగొండ గ్రామ ఘనమైన చరిత్రను గుండెల రాజు భావితరాలకు అందించారని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మానుకోట రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన గుండెల రాజును సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ బీసీ కమిషన్ ఉపేంద్ర, ఓయూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఈ పుస్తకం భావితరాలకు తరగని విజ్ఞాన ఖనిగా అభివర్ణించారు. తాను పుట్టి పెరిగిన గ్రామ చరిత్రను ముందుతరాలకు అందించాలనే ధ్యేయంతో ఈ పుస్తకాన్ని రాశానని రచయిత రాజు తెలిపారు.