కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / వీణవంక : కరీంనగర్ జిల్లా చల్లూరు ఇసుక క్వారీ పరిధిలో అక్రమాలపై ఉన్నత అధికార యంత్రాంగం స్పందించింది. క్వారీ విషయంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, రైతుల బావుల పూడ్చివేత వంటి అంశాలను ఎండగడుతూ ఈనెల 14న ‘బావులు పూడ్చి.. బోర్లు కూల్చి.. మానేరు ఇసుక దందా!’, 15న ‘ఇసుక దందాకు రైతుల అడ్డుకట్ట’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న వీణవంక ఎస్ఐ తిరుపతి బాధిత రైతులకు సమాచారం ఇచ్చి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని, నిబంధనల ఉల్లంఘనల వంటి అంశాలను రైతులు వివరించగా.. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ జిల్లా మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో అర్డబ్ల్యూస్, టీజీ-ఎండీసీ అధికారులు క్వారీకి వెళ్లి విచారణ జరిపారు. నిజానికి ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై స్పందించిన కల్టెర్ పమేలా సత్పతి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తున్నది. విచారణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. విచారణ గురించి తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని, అధికారులను ప్రశ్నించారు. బాధిత రైతులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు.
‘నష్టపోయింది మేము. క్వారీ నడవాల్సింది చల్లూరు శివారులో.. నడుస్తున్నది ఇప్పల్లపల్లి శివారులో.. ఈ వివరాలన్నింటినీ మేం చెబితే మీరు రాసుకోవాలి కదా..?’ మమ్మల్ని పిలువకుండా.. క్వారీ నిర్వాహకులకు మాత్రమే సమాచారం ఇస్తే ఎలా.. నష్టాలకు సంబంధించిన విషయాలను వినకుండా.. ఉన్నతాధికారులకు ఏం రిపోర్టు ఇస్తారు’ అని ప్రశ్నించారు. ఓ అధికారి మాట్లాడుతూ.. రైతులకు సమాచారం ఇవ్వమని తమకెవరూ చెప్పలేదని, విచారణ మాత్రమే చేయమన్నారని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. సమాచారం ఇవ్వకపోగా.. జరిగిన అన్యాయాలపై వివరాలు తీసుకోకుండా.. రిపోర్టు ఎలా ఇస్తారంటూ రైతులు నిలదీశారు. తమకు న్యాయం జరక్కపోతే లోకాయుక్తను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మైనింగ్ ఏడీ రాఘవరెడ్డికి ’నమస్తే తెలంగాణ’ ఫోన్ చేయగా, విచారణ నివేదికను కలెక్టర్కు సమర్పిస్తున్నామని, అక్కడే వివరాలు తీసుకోవాలని చెప్పారు.
రైతులతో కలసి ఏసీపీ విచారణ
మైనింగ్, ఇతర విభాగాల అధికారులు విచారణ చేసిన వెళ్లిన తర్వాత హుజూరాబాద్ ఏసీపీ మాధవి వెళ్లి రైతులను కలిసి విచారణ జరిపారు. టీజీ ఎండీసీ అధికారులను పిలిపించి, మ్యాపులను తెప్పించి చూశారు. రైతులకు జరిగిన నష్టం, బావుల పూడ్చివేత, ఇసుక , నిర్ధారిత హద్దులు దాటి ఇసుక తీసినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేశారు. ఏసీపీ మాధవి జరిపిన విచారణకు.. మైనింగ్ అధికారులు జరిపిన విచారణకు చాలా తేడాలున్నాయని రైతులు తెలిపారు. ఏసీపీ బాధిత రైతులనుంచి వివరాలు సేకరించారని, మైనింగ్, ఇతర అధికారులు బాధిత రైతులతో మాట్లాడకుండా.. ఏకపక్షంగా వచ్చి చూసి వెళ్లారని, దీనిపై కలెక్టర్ స్పందించి అవసరమైతే మరోసారి విచారణ జరిపించాలని కోరారు. సీపీ గౌష్ఆలం ఆదేశాల మేరకు విచారణ జరిపామని మాధవి తెలిపారు.