హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరులో ఇటీవల మట్టిదిబ్బ నుంచి బయటపడ్డ పురాతన ఆలయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ.. దేవాలయ వాస్తు శైలి సామాన్య శకం 9, 10 శతాబ్దాల నాటి రాష్ట్ర కూటుల కాలానికి చెందినదని చెప్పారు. ప్రముఖ చరిత్రకారుడు, స్థపతి ఈమని శివనాగిరెడ్డిని సంప్రదించగా ఇది టిపికల్ రాష్ట్ర కూట దేవాలయమని చెప్పారని అన్నారు. ఇక్కడున్న వాస్తు శైలి చాలా అరుదైనదని, ప్రవేశ ద్వారం మీద కీర్తి ముఖాలతో నాలుగు కుడులు, గోడల మీద కుడ్య స్తంభికలు, నాలుగు అంచుల ప్రస్తరం, లలాటబింబంగా గజ లక్ష్మి, స్వస్తిక భంగిమలో చతుర్భుజాలతో శైవ ద్వార పాలకులు నిల్చొని ఉన్నారని వివరించారు. దేవాలయం మీద ఎత్తైన విమానాలు, గోడల మీద శిల్పాలు లేవని చెప్పారు. గర్భ గుడిలో క్షితిజ సమాంతరంగా చతురస్రాకారపు పానవట్టంలో బాణ లింగం ప్రతిష్ఠించారని అన్నారు. వైవిధ్యమైన, చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పురాతన ఆలయాన్ని రక్షించుకోవాలని స్థానికులకు సూచించారు. ఆలయాన్ని సందర్శించిన బృందంలో మఠం వినోద్‌కుమార్, వేముగంటి మురళీకృష్ణ ఉన్నారు.