హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్తు(టీవీవీపీ)ని ప్రభుత్వం ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్‌హెచ్)గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం డీఎస్హెచ్ను హెచ్వోడీగా పరిగణిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నేండ్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఉన్న టీవీవీపీకి జీతాలు ట్రెజరీ నుంచి రానున్నాయి. డీఎంఈ, డీహెచ్లాగానే ప్రభుత్వ శాఖలా డీఎస్‌హెచ్ నిర్వహణ కొనసాగనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ వైద్య విధాన పరిషత్తు 1987 మార్చి 1న ఏర్పడగా.. ప్రత్యేక రాష్ట్రం లో తెలంగాణ వైద్య విధాన పరిషత్తుగా మారింది.
దీనికి 183 దవాఖానలు ఉండగా.. సుమారు 12,600 వరకు వైద్యులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పరిషత్తులో కొన్ని ఇబ్బందుల కారణంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ హయాంలో నాటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు టీవీవీపీని డీఎస్‌హెచ్‌గా మార్చే ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. 2023లో ఒక ప్రత్యేక కమిటీని నియమించడంతో ప్రభుత్వంలోకి తీసుకొని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని కమిటీ స్పష్టం చేసింది.