హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి చెల్లించే గౌరవ వేతనాన్ని మూడు రెట్లు పెంచిం ది. ప్రస్తుతం నెలకు రూ.వెయ్యిగా ఉన్న గౌరవ వేతనాన్ని రూ.3 వేలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో నంబర్ 8 జారీచేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలను రూ. వెయ్యి నుంచి నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్టు నిరుడు మార్చి 15న సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
గౌరవ వేతనం పెంపుతో రాష్ట్రంలోని 54, 201 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు లబ్ధిచేకూరనున్నది. రాష్ట్రంలో 27 వేల పైచిలు కు పాఠశాలు ఉండగా, 25 మందిలోపు విద్యార్థులు ఉన్న బడుల్లో ఒక కుక్ కమ్ హెల్పర్, 26 నుంచి వందలోపు విద్యార్థులు ఉన్న బడు ల్లో ఇద్దరు కుక్ కమ్ హెల్పర్లు, ఆపైన ప్రతి వంద మంది విద్యార్థులకు ఒకరు చొప్పున కుక్ కమ్ హెల్పర్లను నియమించుకోవచ్చు. ఇలా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 34,485, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 19,716 మంది చొప్పున మొత్తంగా 54,201 మంది పనిచేస్తున్నారు. వీరికి 2010 నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున 10 నెలలకు గౌరవవేతనాన్ని ఇస్తున్నారు. తాజా పెంపుతో వీరి గౌరవ వేతనం రూ.3 వేలకు చేరనున్నది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పథకంలోని కుక్ కమ్ హెల్పర్లకు చెల్లించాల్సింది రూ. వెయ్యి మాత్రమే. ఈ లెక్కన 60:40 నిష్పత్తిలో కేంద్రం రూ.600 ఇస్తుండగా, రాష్ట్ర వాటాగా రూ.400 ఇస్తున్నారు. తాజాగా పెంచిన రూ.2 వేలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది. ఈ లెక్కన రాష్ట్రం రూ.2,400 ఇస్తుండగా.. కేంద్రం రూ.600 మాత్రమే ఇవ్వనున్నది.
ఇన్ని రోజులు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలె. ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినం. నెలకు వెయ్యి రూపాయలతో ఇల్లు గడుస్తలేదు. రోజు కూలీ కూడా గిట్టుబాటు అయితలేదు. సీఎం కేసీఆర్ సార్ మా గురించి ఆలోచించడం చాలా సంతోషం. పెంచిన మూడు వేలతో భరోసా లభించింది. కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– కుంబాల శాంతమ్మ, కుక్ కమ్ హెల్పర్,
ఎంపీపీఎస్ ఆరెపల్లి (జగిత్యాల)