హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో వారి విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 178 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వర్తించనున్నాయి. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ కిందిస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పోలీస్, స్టాఫ్ నర్స్, గురుకులం, సింగరేణిల్లో మూడు నెలల్లోనే 23 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం, తెలంగాణ వీఆర్వోల జేఏసీ ధన్యవాదాలు హర్షం వ్యక్తం చేశాయి.