Dalit bandhu | కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో బాగున్నదని గూగుల్ టీమ్ ప్రశంసించింది. వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల సేకరణ కోసం గౌరవ్ అగర్వాల్ నేతృత్వంలోని గూగుల్ టీమ్ సభ్యులు గురువారం కరీంనగర్ జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం గురించి వివరించారు. కరీంనగర్‌లోని కోర్టు రోడ్లో దళితబంధు పథకం కింద నిర్వహిస్తున్న అమెరికన్ టూరిస్టర్ షో రూమ్‌ను చూపించారు.
ప్రతి నెలా ఎంత వ్యాపారం జరుగుతున్నది? ఇంత పెద్ద ఇంటర్నేషనల్ షాపు నిర్వహించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలకు లబ్ధిదారు అజయ్ సమాధానం చెప్పారు. ప్రతి నెలా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నదని, ఇలాంటి షాపు కరీంనగర్లో ఒకటి మాత్రమే ఉండటంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణ పెరిగిందని తెలిపారు. గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్‌తోపాటు సభ్యులు మాట్లాడుతూ.. ఇంత చిన్న నగరంలో అమెరికన్ టూరిస్టర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ షో రూం ఉండటం, అందులో దళితబంధు పథకం కింద పెట్టడాన్ని అభినందించారు.
ఏడాది కాలంగా మంచి లాభాలు గడిస్తున్న లబ్ధిదారులను అభినందించారు. ఇలాంటి పథకాలతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తున్నదని, రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హైదరాబాద్, బెంగళూరు గూగుల్ బృంద సభ్యులు ఇషాన్ దేశ్ పాండే, నిహారికారెడ్డి, దినేష్ తివారి ఉన్నారు.