హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటని చందంగా మారింది కేంద్రంలోని మోదీ పాలన. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి దేశవ్యాప్తంగా ఐదేండ్లలో 10 వేల కొత్త ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో) ఏర్పాటుతోపాటు పాత వాటికి సహకారం అందించనున్నట్టు 2021 ఫిబ్రవరిలో కేంద్రం ఆర్భాటంగా ప్రకటించింది. ఇందుకు బడ్జెట్లో రూ.6,865 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. కానీ, రెండేండ్లు గడిచినా 1,039 ఎఫ్‌పీవోలను మాత్రమే ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికంగా వెల్లడించడం గమనార్హం. బడ్జెట్ కేటాయింపులో భారీగా కనిపిస్తున్నా.. చేసిన ఖర్చు మాత్రం అంతంత మాత్రమే. ప్రతి కొత్త ఎఫ్‌పీవోకు మూడేండ్లకు రూ.18 లక్షల ఆర్థికసాయాన్ని చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన 1,039 ఎఫ్‌పీవోలకు చేసిన ఖర్చు రూ. 1870 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో కేంద్రం అమలుచేస్తున్న ఎఫ్‌పీవోల పథకం ప్రచార ఆర్భాటమే తప్ప మరేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బీజేపీ పాలిత రాష్ర్టాలకే అత్యధికం
కొత్త ఎఫ్‌పీవోల ఏర్పాటులోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలపై అధిక ప్రేమ ఒలకబోసింది. 1,039 కొత్త ఎఫ్‌పీవోల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 114, మహారాష్ట్రలో 104, గుజరాత్లో 57, కర్ణాటకలో 59, ఏపీలో 70 ఏర్పాటు చేసింది. తెలంగాణకు కేవలం 20 ఏర్పాటు చేసింది. రైతులెక్కడైనా రైతులేనని, అలాంటి రైతులపై కేంద్రం వివక్ష చూపడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల మాదిరిగా తెలంగాణలోనూ ఎఫ్‌పీవోలను అధిక ఏర్పాటుచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.