హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని అమెరికన్ మెడికల్ అసోసియేషన్(ఏఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ బాబీ ముకామల తెలిపారు. భారత్, అమెరికా వైద్యులను ఒకే వేదికపైకి తీసుకురావడం అద్భుతమైన పరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఏఎంఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇండో-అమెరికా ఆరోగ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఇదొక చారిత్రాత్మక సమావేశమని తెలిపారు. ఆరోగ్య సేవలు, వైద్య విద్యను ప్రోత్సహించడంలో రాష్ట్రం ముందువరుసలో ఉన్నట్టు చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ మెడికల్ టూరిజానికి గమ్యస్థానంగా మార్చాలని ఆకాక్షించారు.
180 ఏండ్ల ఏఎంఏ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి ఏసియా-అమెరికన్, భారతీయ మూలాలున్న వ్యక్తిగా బాబీ ముకామల రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో గ్లోబల్ ఆరోగ్య సవాళ్లను ఎదురొనేందుకు ఏఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం వైద్య నైపుణ్యానికి, ఇన్నోవేషన్‌కు ప్రపంచ కేంద్రంగా మారుతున్నట్టు ఈ సందర్భంగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, హోస్ట్ కమిటీ సమన్వయకర్త డాక్టర్ గురు ఎన్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి, ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వర్రావు, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి తదితరులు పాల్గొన్నారు.