హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. హైదరాబాద్ ఉస్మానియా వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపూరం గ్రామానికి చెందిన పేద విద్యార్థిని సుస్మిత చదువు కోసం ఆపన్న హస్తం అందించాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా దాతలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ పిలుపుతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ చంద్రశేఖర్ పాటకోటి, ఆయన భార్య ప్రణయవాణి.. సుస్మిత చదువుకయ్యే ఖర్చులను భరిస్తామని ముందుకొచ్చారు.
సోమవారం కేటీఆర్ నివాసంలో సుస్మితకు ఆమె కుటుంబసభ్యుల సమక్షంలో కేటీఆర్ చేతుల మీదుగా రూ.లక్ష సాయం అందజేశారు. వైద్య దంపతుల ఔదార్యాన్ని కేటీఆర్ అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సుస్మిత భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన కేటీఆర్, వైద్య దంపతులకు కతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.