ములుగు రూరల్, మార్చి 4 : ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయంపై గెట్టు పంచాయితీ ముదిరింది. గట్టమ్మ తల్లి సాక్షిగా సోమవారం ఆలయం వద్ద జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు, గ్రామస్థులు, ములుగు ఆదివాసీ నాయక్‌పోడ్ పూజారుల మధ్య ఘర్షణ జరిగింది. డీఎస్పీ రవీందర్, ములుగు, పస్రా సీఐలు మేకల రంజిత్‌కుమార్, శంకర్, ములుగు, వెంకటాపూర్, పస్రా ఎస్సైలు వెంకటేశ్వర్, చల్లా రాజు, మస్తాన్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి చేజారకుండా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
70, 80 ఏండ్ల నుంచి ఆదివాసీ నాయక్‌పోడ్‌లు గట్టమ్మకు పూజారులుగా కొనసాగుతున్నారని ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, పూజారులు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు జాకారం పరిధి అని చెప్పి గొడవలు స్పష్టించారని గుర్తు చేశారు. 2015లో పూర్తి హక్కులు తమకేనని కోర్టులో తీర్పు వచ్చిందని తెలిపారు. గట్టమ్మ వద్ద పూజలో ఉన్న తమపై జాకారం గ్రామ ముదిరాజ్‌లు, గ్రామస్థులు దాడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆర్డర్ ప్రకారం గట్టమ్మ దేవాలయం తమకే చెందిందని ముదిరాజ్ పూజారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షుడు ఈర్ల చేరాలు, సభ్యులు తెలిపారు. 1953 నుంచి తామే గట్టమ్మ పూజారులమని, గట్టమ్మ వద్ద గుడి, గద్దెలను కట్టించింది కూడా తామేనని చెప్పారు. 2016లో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రస్తుతం తాము గట్టమ్మ దేవాలయానికి వచ్చినట్లు తెలిపారు.