నిజామాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగా ణ ప్రతినిధి): దేశంలో మరెక్కడా లేనివిధంగా గ్రామీణ యువత కోసం ఆంత్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ సెంటర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నిర్మితం అవుతున్నది. ఇప్పటి వరకు నగరాల్లోనే కనిపిస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్ల కంటే ఇది ప్రత్యేకం. పూర్తిగా గ్రామీణ యువత ఆలోచనలకు కార్యరూపం కల్పించటంతో పాటుగా స్టార్టప్ కంపనీలకు ప్రోత్సాహం అందించటం దీని ముఖ్య ఉద్దేశం. కాకతీయ శాండ్బాక్స్ పేరిట పుష్కరకాలం కింద నెలకొల్పిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు ఫణీంద్ర సామ, రాజురెడ్డి చొరవతో కార్యరూపం దాల్చుతున్నది. ప్రముఖ ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త కన్వల్సింగ్రేఖి రూ.20 కోట్ల ఆర్థిక సాయం అందించగా, కన్వల్రేఖి రూరల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ సెంటర్ (కేఆర్ఈఎస్టీ-క్రెస్ట్) నిర్మాణం జరుగుతున్నది. టీహబ్ తరహాలోనే క్రెస్ట్‌ను కే-హబ్ అని పిలుస్తున్నారు. ఆరు నెలల క్రితమే డిచ్‌పల్లిలో నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని ప్రారంభించాలని సంకల్పించారు.
కాకతీయ శాండ్బాక్స్ నిజామాబాద్ కేంద్రం గా 2012లో స్థాపితమైంది. రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ, సియెర్ర అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి కలిసి పుట్టినగడ్డకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈ సంస్థకు పురుడు పోశారు. 12 ఏండ్లుగా నిర్విరామంగా కాకతీయ శాండ్బాక్స్ అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇతర కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ఉత్తర తెలంగాణలో రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతకు వెన్నెముకగా నిలిచి వారికి వెలుగు దివ్వెగా మారింది. కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా స్థాపితమైన దేశ్‌పాండే ఫౌండేషన్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని స్థాపించి విభిన్నమైన సేవామార్గాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నారు. వ్యవసాయంలో రైతులకు మెళకువలు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, మహిళలకు రుణసాయంతో వ్యాపార అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ సంస్థ పాటుపడుతున్నది. త్వరలోనే కే-హబ్ పూర్తిచేసేందుకు ముందుకు సాగుతున్నది.
ఉత్తర తెలంగాణలో పత్తిపై ఆధారపడ్డ రైతులు అనేకం. వారి కోసం బెటర్ కాటన్ ఇనిషియేటివ్(బీసీఐ) ద్వారా అత్యుత్తమైన పత్తిని ఉత్పత్తి చేసేలా కాకతీయ శాండ్బాక్స్ పాటుపడుతున్నది. దీని ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటకలో 90 వేల మంది రైతుల నుంచి 70 వేల టన్నుల నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేశారు. ఈ ప్రోగ్రామ్‌తో రైతుల ఆదాయం 18 శాతం మేర పెరిగింది. నీటి కొరతను తీర్చేలా వివిధ పరిమాణాల్లో ఫామ్పాండ్లను నిర్మిస్తున్నారు. వాతావరణ వైవిధ్యం, నీటినిల్వ లేకపోవడం, పంట నష్టం, లాభదాయకమైన ధరలు వంటివాటి కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం, బ్యాంకుల సహకారంతో 1,183 ఫార్మ్ పాండ్లను తవ్వించారు. కాకతీయ శాండ్బాక్స్ ద్వారా 7 వేలకుపైగా ఫామ్పాండ్లు నిర్మించారు. వరి నాట్లను యాంత్రీకరణ పద్ధతిలో చేపట్టి దిగుబడిలో విజయం సాధించారు. శాస్త్రీయ విధానంలో 1,200 మంది రైతులకు చెందిన 400 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టి రైతులకు అవగాహన కల్పించారు. దీని ద్వారా 23 శాతం నీటి వినియోగం తగ్గిందని, 19 శాతం దిగుబడులు పెరిగిందని, 25 శాతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందని కాకతీయ శాండ్బాక్స్ గుర్తించింది.
స్కిల్ ఇన్ విలేజ్ కార్యక్రమం ద్వారా 30 చోట్ల కేంద్రాలను ఏర్పాటుచేసి గ్రామీణ పేద విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యాభ్యాసంలో మెళకువలతో పాటుగా క్రీడాసంబంధిత అంశాల్లో ప్రత్యేక శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నారు. దీని ద్వారా 6,089 మందికి లబ్ధి జరిగింది. ముఖ్యంగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు స్కిల్ ఇన్ విలేజ్‌ను వర్తింపజేస్తున్నారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, గణితం, ఆంగ్లభాషల్లో నైపుణ్యాలను కాకతీయ శాండ్బాక్స్ బృందాలే బోధిస్తున్నాయి. 2026-27 నాటికి 150 కేంద్రాలు ఏర్పాటు చేసి 18 వేల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చాలని వీరు సంకల్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎన్నారైలు ఆర్థిక సాయం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ నిపుణుడు, సామాజిక కార్యకర్త పాకాల శ్రీకాంత్‌రెడ్డి కార్యక్రమం రూపకల్పనలో సలహాలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల పిల్లలను నిజామాబాద్‌లోని కాకతీయ శాండ్బాక్స్ కార్యాలయానికి తీసుకొచ్చి బోధన చేపడుతున్నారు. మహిళా సాధికారత కోసం ఆంత్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 2,388 మందికి శిక్షణ ఇచ్చారు. 5,668 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్తర తెలంగాణలోని ఔత్సాహిక మహిళలకు మగ్గం వర్క్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసుల తయారీ, జూట్ సంచుల ఉత్పత్తి, ఎంబ్రాయిడరీ, కుట్టు మిషన్లలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్య, ఉపాధి నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు స్కిల్ ప్లస్, స్కిల్ ప్లస్ ఆర్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్నారు. డిగ్రీ పూర్తి చేసినవారికి కాకతీయ శాండ్బాక్స్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ చదువుతున్న వారికి కాలేజీల్లోనే ప్రత్యేక తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.