కల్వకుర్తి రూరల్, నవంబర్ 9 : తాము సాగు చేసుకుంటున్న భూముల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని తర్నికల్ రైతులు హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ పరిసరాల్లో ఉన్న భూముల్లోకి శనివారం గ్రామానికి చెందిన రైతులు వెళ్లారు. రాజేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లేశ్, భానుచందర్, చెన్నయ్య, నబీ, రెడ్యానాయక్, శ్రీశైలంతోపాటు పలువురు ట్రాక్టర్లతో దున్నిచ్చారు. ఇటీవల ఈ భూము లు ధరణిలో జాగీర్దారుల పేర్ల పైకి ఎక్కడంతో క్రయవిక్రయాలు జరగడంతో రైతులు టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తమ భూముల వద్దకు వస్తే ఉద్యమిస్తామని పలువురు హెచ్చరించారు. జాగీర్దార్ వారసులు నేరుగా వచ్చి తమతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటు న్నాం.. వాటికి శిస్తులు చెల్లించాం.. ఇప్పుడు ఎవరో వచ్చి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తామెలా జీవనం సాగించాలని వారు మండిపడుతున్నారు.