టేకులపల్లి, మే 14: దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు కూడా ఆ పార్టీకి తగిన బుద్ధిచెప్తారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, వారు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
ఆదివారం టేకులపల్లిలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. బీఆర్ఎస్కు బలం, బలగం కార్యకర్తలు, ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ద్వారా లబ్ధిపొందిన కొందరు నాయకులు ఇప్పుడు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.