హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలోని 927 గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అత్యద్భుతంగా విద్యాబోధన సాగుతున్నదని తెలిపారు. శనివారం అసెంబ్లీలో విద్యాపద్దుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్లో విద్యావ్యవస్థకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయం నుంచే కేసీఆర్ విద్యావ్యవస్థ గురించి చర్చించిన రోజులు గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇస్తున్న డైట్ చార్జీలను రూ.50కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. సర్వేల్ రెసిడెన్షియల్ పాఠశాల గోల్డెన్ జూబ్లీని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.