హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ధర్మ సంస్థాపన బ్రాహ్మణుల కర్తవ్యమని, బ్రాహ్మణజాతి సముద్ధరణకు సమాజం సహకరించాలని పుష్పగిరి పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు ఉద్బోధించారు. బ్రాహ్మణుల పట్ల కొందరిలో నెలకొన్న ద్వేషభావాన్ని తొలగించడంతోపాటు వారి ధర్మాచరణకు, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందించేందుకు అన్ని వర్గాలవారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టీచ ర్లు, మేనేజ్మెంట్ నిపుణులు ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్సలెన్స్ సంస్థను ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
బేగంపేటలోని పుష్పగిరి జగద్గురు సంస్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా భారతీ స్వామీజీ ప్రసంగిస్తూ.. బ్రాహ్మణుల ఐక్యతకు, బ్రాహ్మణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ ఎంతో కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల్లోని పలువురు రాజకీయ నేతలు, బ్రాహ్మణ ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరై సంస్థ పురోభివృద్ధి కోసం తగిన సూచనలు ఇచ్చారు. సంస్థ ఉద్దేశాలను అధ్యక్షుడు ఒద్దిరాజు విజయ్, ప్రధాన కార్యదర్శి వనం జ్వాలా నరసింహారావు వివరించారు.
కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ ఏంజీ గోపాల్, ఏపీ మాజీ డీజీపీ కరణం అరవిందరావు, మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకరరావు, ‘హన్స్ ఇండియా’ ఎడిటర్ రాము శర్మ, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సీనియర్ ఎడిటర్ కొరిడె మహేశ్, ఆర్థికవేత్త ఎస్వీ రావు, పారిశ్రామికవేత్త చెరువు రాంబా బు, ఖమ్మం అడ్వకేట్ హరిబాబు, సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్సలెన్స్ సంస్థ సంయుక్త కార్యదర్శి మరుమాముల వెంకటరమణ శర్మ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పూండ్ల కల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.