హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ): ‘జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు. వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా త్వరలోనే జిల్లాలు, మండలాల పునర్విభజన చేస్తాం. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తాం. ఆరు నెలల్లో రిపోర్ట్ ఇచ్చేలా ఆదేశాలిస్తాం’- ఇవీ ఈ నెల 12న టీజీవో సెంట్రల్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ‘మా ప్రభుత్వానికి జిల్లాల పునర్విభజన ఆలోచనే లేదు. అసలు ఆ ఆలోచనే తప్పుడు ఆలోచన. దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరూ మాట్లాడలేదు. ఎవరో ఏదో రాసుకొని వారే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వద్ద ఆ ప్రపోజల్ లేదు. ఆ ఆలోచన లేదు’- ఇవీ గురువారం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు.
ఇవీ.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఒక కీలక అంశంపై చేసిన విరుద్ధ వ్యాఖ్యలు. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక విధంగా మాట్లాడితే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో విధంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి మాటలు నిజం? జిల్లాల పునర్విభజన ఉంటుందా? లేదా? అనే అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే, ఒక కీలక అంశంపై ప్రభుత్వంలోని ఇద్దరు కీలక వ్యక్తులు విభిన్నంగా ప్రకటనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇది ప్రభుత్వమే నా? వీళ్లు మంత్రులేనా? ఒక కీలక అంశంపై చర్చించుకోకుండానే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారా?’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ప్రభుత్వంలో చర్చించి ఉంటే ఇలా సీఎం, డిప్యూటీ సీఎం విభిన్న వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పునర్విభజనపై ప్రకటన చేసిన రోజే దానిని మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఖండించారు. జిల్లాల పునర్విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా, జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదని, పునర్విభజన చేయాల్సిన అవసరం ఉన్నదని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా ఒక అంశంపై మంత్రుల మధ్యనే స్పష్టత లేనప్పుడు ఇక ప్రజలకేం స్పష్టత ఇస్తారనే విమర్శలొస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులను సంప్రదించకుండా, వారితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి, మంత్రులు విభిన్నంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
కేసీఆర్‌పై అక్కసుతోనే !
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా మాజీ సీఎం కేసీఆర్‌పై అక్కసుతోనే పాలన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిజ్ఞ పూనారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జిల్లాల విభజన అంశాన్ని తెర మీదికి తెచ్చారు. శాస్త్రీయత, అశాస్త్రీయత పేరుతో జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధంచేస్తున్నారు. జిల్లాల్లో కేసీఆర్ మార్క్ ఉండకుండా వాటిని ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు కేసీఆర్ ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రాతిపదికగా జిల్లాలను విభజించారు. తద్వారా పేద ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేశారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాంటి శాస్త్రీయత లేకుండా కేవలం కేసీఆర్‌పై కక్షతోనే జిల్లాలను మార్పు చేసే పనికి శ్రీకారం చుడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.