హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖ బదిలీల్లో లక్షల రూపాయల పందేరానికి తెరలేచింది. ఒక్క ఫోకల్ పోస్టుకు అక్షరాలా రూ.25 లక్షలు ఫిక్స్ చేశారట. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా, ఇదే నిజమని ఎక్సైజ్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. ఎక్సైజ్ శాఖలో దాదాపు 150 మంది సీఐల బదిలీకి కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవలే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు పూర్తయ్యాయి. ఎస్ఐ నుంచి జేసీ స్థాయి వరకు మే నెలలో బదిలీలు పూర్తిచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మూటల బరువు చూసి, తూకానికి తగ్గట్టు పోస్టింగులు పంచేందుకు ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రత్యేక అధికారిని నియమించినట్టు చెప్తున్నారు.
ఎక్సైజ్ శాఖలో రెవెన్యూ స్టేషన్లు, క్రైమ్ స్టేషన్లు అనే విభజన ఎప్పటి నుంచో ఉన్నది. వీటినే ఫోకల్, నాన్ ఫోకల్ స్టేషన్లు అని చెప్పుకుంటారు. రాబడి స్థాయిని బట్టి నంబర్ వన్ ఫోకల్ స్టేషన్, ఏ గ్రేడ్ స్టేషన్, సెకండ్ గ్రేడ్ స్టేషన్‌గా పిలుస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న 14 ఎక్సైజ్ స్టేషన్లకు అత్యంత ఫోకల్ స్టేషన్లుగా గుర్తింపు ఉన్నది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్న ఈ స్టేషన్లను మార్కెట్లో పెట్టినట్టు సమాచారం. ముందుగా వీటికి రూ.50 లక్షలు వసూలు చేయాలని భావించినట్టు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫోకల్ స్టేషన్లను ఒక్కొక్కదానిని రెండుగా విభజించి కొత్త స్టేషన్లను ఏర్పాటుచేసింది. దీంతో మరో 14 స్టేషన్లు అదనంగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్‌కు రూ.25 లక్షల చొప్పున రేటు ఫిక్స్ చేసినట్టు ఎక్సైజ్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. వీటికోసం అంతర్గతంగా వేలం పా టలు జరుగుతున్నాయని, ముందుగా అడ్వాన్స్ చెల్లించి రిజర్వ్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం అనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఫోకల్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు ఆర్థికంగా బలపడ్డారని, ఆ డబ్బుతో మళ్లీ ఫోకల్స్టేషన్ కోసం పైరవీలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే కీలక నేతకు చెందిన ప్రత్యేక అధికారి జా బితా సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
ఇటీవల జరిగిన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీల్లో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నాన్ ఫోకల్ టు ఫోకల్ అనే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ బదిలీల విషయంలో కమిషనర్ మీద ఒత్తిడి వచ్చినా తట్టుకొని నిలబడ్డారని, అవినీతికి అవకాశం లేకుండా పూర్తిచేశారని ఎక్సైజ్ కానిస్టేబుళ్లు చెప్తున్నారు. కానీ ఆ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారుల మీద నోరు పారేసుకోవడం, నోడల్ ఈఎస్‌లు చేయాల్సిన బదిలీలను తన చేతిలోకి తీసుకోవడంతో వివాదాలు చుట్టుముట్టా యి. ఎక్సైజ్ చట్టం ప్రకారం ఏఈఎస్ నుంచి జేసీ స్థాయి అధికారుల బదిలీలు ప్రభుత్వం చేస్తుంది. సీఐల బదిలీలు కమిషనర్ స్థాయిలోనే చేపట్టాలి. దీంతో ఫోకల్, నాన్ ఫోకల్ పాయింట్ల ఆధారంగా బదిలీ చేయాలనే దానిపై కమిషనర్ కసరత్తు పూర్తిచేశారని చెప్తున్నారు.