Google Map | బొమ్మలరామారం, జూన్ 7 : గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లిన డీజిల్ ట్యాంకర్.. దారి తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని పెద్దపర్వతాపురం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రంలోని రిజినెన్స్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి డీజిల్ తీసుకొస్తున్న లారీ ట్యాంకర్ డ్రైవర్ బొమ్మలరామారం నుంచి వెళ్లే ప్రధాన రహదారి గుండా కాకుండా గూగుల్ మ్యాప్‌లో చూసి పర్వతాపురం నుంచి వెళ్లేందుకు బయలుదేరాడు.
కాసేపటికి గూగుల్ మ్యాప్ రూట్ చూపించకపోవడంతో డ్రైవర్ లారీని ఒక్కసారిగా నిలిపివేశాడు. దాంతో డీజిల్ లోడ్‌తో ఉన్న లారీ దిగువకు జారి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ట్యాంకర్ నుంచి కారుతున్న డీజిల్‌ను పట్టుకునేందుకు స్థానికులు డబ్బాలతో ఎగబడ్డారు.