హైదరాబాద్, ఏప్రిల్2 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా దామరవాయి మండలం మొట్లగూడెం గ్రామంలో పాతరాతియుగం సమాధులను గుర్తించినట్టు హెరిటేజ్‌శాఖ బృందం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆదేశాల మేరకు హెరిటేజ్ డైరెక్టర్ ఆచార్య అర్జున్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పీ నాగరాజు, ఓఎస్డీ ఏ రాజుతో కూడిన టెక్నికల్ బృందం మొట్లగూడెం గ్రామాన్ని సందర్శించినట్టు తెలిపింది. ఈ మేరకు గ్రామ పరిసర ప్రాంతాల్లో మానవ నిర్మిత సమాధులు సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నది.
ఈ సమాధులను స్థానికులు ‘రాక్షస బండలు’, ‘రాక్షస గుహలు’ తదితర పేర్లతో పిలుస్తున్నారని బృందం వెల్లడించింది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఇప్పటికే అనేక చోట్ల ప్రాచీన మానవ నిర్మిత సమాధులు గుర్తించామని, అవి ఆ కాలంలో మానవుల ఉనికితోపాటు వారి జీవన విధానం, ఆచారాలు, వృత్తులు, సామాజిక నిర్మాణం తదితర అంశాలపై విలువైన చారిత్రక ఆధారాలను అందిస్తున్నాయని తెలిపింది. సమాధుల నిర్మాణంలో ప్రాచీన మానవులు అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించారని, ఈ డాల్మెన్ సమాధులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నది. ఈజిప్ట్ పిరమిడ్లలాగే, మరణానంతరం పునర్జన్మపై ఉన్న విశ్వాసాన్ని ఈ సమాధులు సైతం ప్రతిబింబిస్తాయని బృందం వెల్లడించింది.