హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఫిన్లాండ్ దేశంలో విద్యావిధానంపై అధ్యయనం కోసం రాష్ర్టానికి చెందిన 28 మంది ప్రభుత్వ టీచర్లను విద్యాశాఖ ఎంపికచేసింది. వీరిలో ఇద్దరు ప్రిన్సిపాళ్లు, నలుగురు జీహెచ్ఎంలు, 10 మంది స్కూల్ అసిస్టెంట్లు, 11 మంది ఎస్జీటీలు, ఒక టీజీటీ టీచర్ ఉన్నారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఈ 28 మందితో కూడిన బృందం ఫిన్లాండ్ దేశంలో పర్యటించనున్నది.
వీరికి ఈ నెల 25న ఓరియంటేషన్ నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. టీచర్లను విదేశాలకు పంపించి అధ్యయనం చేయించాలని సర్కార్ నిర్ణయించింది. ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఫిన్లాండ్ దేశంలో అధ్యయనం కోసం 28 మందిని ఎంపికచేసింది.