హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఇంటర్బోర్డులో వివాదాలకు కారణమైన ఆన్‌స్క్రీన్ మూల్యాంకనంపై ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. తాజాగా కొత్త టెండర్లు పిలువగా, బిడ్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 4 వరకు గడువు విధించారు. ఆరోజు టెక్నికల్ బిడ్లను తెరిచి పరిశీలించి టెండర్లు ఖరారు చేస్తారు. ఇంటర్మీడియట్ జవాబుపత్రాలను ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేయాలని గతంలోనే ఇంటర్‌బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. టెండర్ దక్కించుకొన్న సంస్థ మూడేండ్లపాటు ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. తాజాగా ఆన్స్క్రీన్తోపాటు ప్రశ్నపత్రాలను స్కాన్ చేసేందుకు కూడా మరో టెండర్‌ను ఆహ్వానించారు. ఈ రెండు టెండర్లు ఖరారైతే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో నూతన విధానాన్ని అమలు చేస్తారు. ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నపత్రాలను ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేసేలా టెండర్ నిబంధనల్లో పొందుపరిచారు. మే, జూన్‌లో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 12 లక్షల జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.