హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): దళితజాతి సముద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎస్సీ సంక్షేమంలో మకుటాయమానంగా నిలుస్తున్నది. బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందివ్వడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ పథకం కింద 36,678 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కాగా, అంతే సంఖ్యలో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయ్యింది.
ఇప్పటివరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి 1,962 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ కావాల్సి ఉన్నది. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారందరూ స్వయంఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఫోర్ వీలర్లు, ట్రాక్టర్లు, మందుల షాపులు, ఎరువుల దుకాణాలు, డెయిరీ యూనిట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు తదితర ఆదాయం వచ్చే వృత్తులు, ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. వారు స్వయం ఉపాధి పొందుతుండటమే గాకుండా, పలువురికి ఉపాధి చూపే స్థాయికి ఎదగడం గర్వకారణం.
దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం తొలుత హుజూరాబాద్ నియోకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నది. 2021 ఆగస్టు 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఈ పథకానికి 18,211 అర్హమైన కుటుంబాలు ఉండగా ఇప్పటికే 18,000 మందికిపైగా యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో మరో 200 మేరకు యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ కావాల్సి ఉన్నదని, అవి కూడా రాబోయే వారం రోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు.
హుజూరాబాద్‌తోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామం, మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, అచ్చంపేట నియోజకవర్గంలోని చార్గొండ మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 100 మందికి దళితబంధును వర్తింపజేయగా, ఆయా యూనిట్ల గ్రౌండింగ్ కూడా పూర్తికావచ్చింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,500 దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. అందులో తొలి విడతగా నియోజకవర్గానికి 500 యూనిట్లు అందజేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుస్తున్నది. అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అతిత్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్ల పంపిణీ చేపట్టే ప్రక్రియ కొనసాగుతున్నది.